నిజంనిప్పులాంటిది

Feb 20 2023, 11:13

Coal scam: బొగ్గు స్కాంలో 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

న్యూఢిల్లీ : ఛత్తీస్‌ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోమవారం ఉదయం 14 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.

(ED searches) ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh)రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు..

ఈడీ దాడులు చేసిన వారందరూ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్(CM Bhupesh Baghel) సన్నిహితులని సమాచారం. కోల్ లెవీ స్కాంలో(Coal levy scam) కొందరు రాజకీయ నేతలు, అధికారులు 540 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది..

నిజంనిప్పులాంటిది

Feb 19 2023, 09:47

సినిమాను తలపించేలా తారకరత్న జీవితం..

•ప్రేమ పెళ్లి, రాజకీయం ఇలా..

Taraka Ratna Biography | నందమూరి తారక రామారావు పన్నెండవ సంతానంలో 5వ కొడుకు మోహనకృష్ణ. మోహనకృష్ణ కూడా సినిమా రంగంలో పనిచేసిన వారే. ఎన్టీఆర్‌, బాలకృష్ణ, హరికృష్ణ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా మొహన్‌కృష్ణ పనిచేశాడు. మోహన్‌ కృష్ణ, సీత దంపతులకు 1983లో జనవరి 8వ తేదీన తారకరత్న జన్మించాడు. ఏడవ తరగతి వరకు చెన్నైలో చదువుకున్న తారకరత్న ఆ తర్వాత హైదరాబాద్‌లో భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్‌ విద్యను పూర్తిచేశాడు. ఇక గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివాడు.

సినీ జీవితం:

అప్పటికే తారకరత్నకు సినిమాలపై ఇంట్రెస్ట్‌ ఉండటంతో ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలోనే ‘ఒకటో నంబర్‌ కుర్రాడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత ‘యువరత్న’, ‘తారక్‌’, ‘భద్రాద్రి రాముడు’ వంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ‘భద్రాద్రిరాముడు’ వరకు కెరీర్‌ మంచి స్పీడ్‌లోనే ఉంది. ఆ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులు పలకరించాయి. ఇక అప్పుడే రవిబాబు ప్రోత్సాహంతో ‘అమరావతి’ సినిమాతో విలన్‌గా మారి తొలి సినిమాతోనే విలన్‌గా నంది అవార్డు గెలుచుకున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ‘నందీశ్వరుడు’ అనే మాస్‌ సినిమా తీశాడు. అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టి సంఘ విద్రోహశక్తిగా మారిన ఒక ఉత్తమ విద్యార్థి పాత్రలో తారకరత్న జీవించాడు. ఈ సినిమాతో తారకరత్న మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. రిలీజ్‌ రోజున పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. పోటీగా ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘బాడీగార్డ్‌’ సినిమాలుండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయితే హీరోగా ఈ సినిమాతో తారకరత్న మరో మెట్టు ఎక్కాడు.

ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కొంచెం కొంచెంగా తరకరత్న ఫేడవుట్‌ అయ్యాడు. అయితే తన క్రేజ్‌ ఎలా ఉన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలే చేశాడు. ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. చివరగా ఆయన క్రిష్‌ రూపొందించిన ‘9అవర్స్‌’ వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఈ వెబ్‌సిరీస్‌లో తారకరత్న పోలీస్‌ పాత్రలో నటించాడు. దీనికి ముందు ‘S5 నో ఎగ్జిట్‌’ అనే థ్రిల్లర్ సినిమా చేశాడు. ఇదే తారకరత్న నటించిన చివరి చిత్రం. తారకరత్న ఇప్పటివరకు మొత్తం 22 సినిమాల్లో నటించాడు. ఆయన సైన్‌ చేసిన రెండు ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్నాయి.

పెళ్లి:

నందమూరి తారకరత్నది ప్రేమ వివాహం. 2012లో తారకరత్న, అలేఖ్యరెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అలేఖ్య ‘నందీశ్వరుడు’ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. అంతేకాకుండా తారకరత్న.. చెన్నైలో అలేఖ్య సిస్టర్‌కు సీనియర్‌ అట. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీళ్ల పెళ్లికి ఇరు కుంటుబాల నుంచి అంగీకరించలేదట. అయితే అదే టైమ్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి మద్ధతు ఉండటంతో 2012 ఆగస్టు 2న వీరి వివాహం సంఘీ టెంపుల్‌లో జరిగిందని అప్పట్లో ఓ ఇంటర్వూలో అలేఖ్య చెప్పింది. కాగా అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. ఈ కారణంగానే నందమూరి ఫ్యామిలీ తారకరత్న పెళ్ళికి అడ్డంకులు తెలిపినట్లు టాక్‌. ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

రాజకీయం:

నటుడిగా కొనసాగుతుండానే గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో యాక్టీవ్‌గా మారారు. చంద్రబాబు, లోకేష్‌ కూడా తారకరత్నను ప్రోత్సహించడంతో ఆయన ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో తిరుగుతూ స్థానిక నాయకులను కలుస్తూ వచ్చాడు. రానున్న ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగానూ పోటీ చేస్తానని గతంలో చెప్పాడు. ఈ క్రమంలోనే లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్నాడు. గతనెల 27న కుప్పంలో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

నిజంనిప్పులాంటిది

Feb 19 2023, 09:43

Hyderabad: పథకం ప్రకారమే నగలున్న కారుతో పరారీ

•డ్రైవర్‌ను పట్టుకునేందుకు నాలుగు బృందాలు

•శ్రీనివాస్‌ ఎత్తుకెళ్లిన కారు

అమీర్‌పేట: ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో శుక్రవారం రూ.7 కోట్ల వజ్రాభరణాలున్న కారుతో ఉడాయించిన డ్రైవర్‌ కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే మహిళా జ్యువెలరీ వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌(28) కారులో ఉన్న రూ.7 కోట్ల విలువచేసే వజ్రాభరణాలతో పరారైన విషయం తెలిసిందే.

మధురానగర్‌కు చెందిన అనూషకు రూ.50 లక్షల విలువచేసే వజ్రాభరణాలను ఇచ్చేందుకు సేల్స్‌మెన్‌ అక్షయ్‌తో కలిసి వచ్చిన శ్రీనివాస్‌ నగలున్న కారుతో సహా ఉడాయించాడు. కేసు నమోదుచేసుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు శ్రీనివాస్‌ ఉడాయించిన అరగంటలో కారు నంబరును అన్ని ఠాణాలకు పంపి గాలింపు చేపట్టారు. శ్రీనివాస్‌ కారును ఎక్కడో వదిలి బైక్‌పై పరారవుతున్నట్లు గుర్తించారు. శ్రీశైలం రోడ్డు కడ్తాల్‌ వరకు బైక్‌పై శ్రీనివాస్‌ వెళ్లినట్లు గుర్తించారు.

మూడు నెలల కిందటే పనిలోకి.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మూడు నెలల కిందట నగరానికి వచ్చిన శ్రీనివాస్‌ ఎస్సార్‌నగర్‌ సమీపంలోని సాయి హాస్టల్‌లో ఉంటున్నాడు. మూడు నెలల కిందటే రాధిక వద్ద పనిలో చేరాడు. నగరంలోని వివిధ నగల దుకాణం నుంచి వజ్రాభరణాలను కావాల్సిన వారికి రాధిక సరఫరా చేస్తుంటుంది. రోజూ కారులో పెద్దమొత్తంలో వజ్రాభరణాలు తరలిస్తుంటారు. ఈ విషయం గ్రహించిన శ్రీనివాస్‌ చోరికి ముందే పథకం వేసినట్లు తెలుస్తుంది. రెండు రోజుల ముందుగానే భార్యను బెంగళూరు పంపినట్లు పోలీసులు గుర్తించారు. తన ఇద్దరు కుమారులను సోదరుల వద్ద వదిలాడు. తల్లిదండ్రులు మాత్రం కొవ్వూరులోనే ఉంటున్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 19 2023, 09:39

భారాస ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్ షర్మిల అరెస్ట్

మహబూబాబాద్‌: వైతెపా(YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.

షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అరెస్ట్‌ చేసిన అనంతరం హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో వైతెపా ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్‌ శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని భారాస మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లూనావత్‌ అశోక్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం షర్మిలను అరెస్ట్‌ చేశారు.

నిజంనిప్పులాంటిది

Feb 18 2023, 20:03

Shiv Sena: ‘పెద్ద ప్రభావమేమీ ఉండదు..’ ఎన్నికల గుర్తుపై ఉద్ధవ్‌తో శరద్‌ పవార్‌!

ముంబయి: శివసేన(Shiv Sena) పేరు, పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’.. మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ECI) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివసేన(యూబీటీ) వర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray).. ఈసీ వ్యవహార తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని విమర్శించారు. ఈ క్రమంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NC) చీఫ్ శరద్ పవార్‌(Sharad Pawar) తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. పార్టీ ఎన్నికల గుర్తు కోల్పోవడంతో పెద్ద ప్రభావమేమీ ఉండదని తన మిత్రపక్షం ఉద్ధవ్ వర్గంతో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అంగీకరించి, కొత్త గుర్తును తీసుకోవాలని ఠాక్రేకు సూచించారు. కొత్త గుర్తును ప్రజలు అంగీకరిస్తారని కూడా ఆయన చెప్పారు.

‘కాంగ్రెస్‌ కూడా మార్చుకుంది..’

‘ఇది ఎన్నికల సంఘం నిర్ణయం. ఒకసారి నిర్ణయం వెలువడ్డాక చర్చలకు తావులేదు. దానిని శిరసావహించండి. పాత గుర్తును కోల్పోవడంతో పెద్దగా ప్రభావం ఉండదు. ప్రజలు కొత్త ఎన్నికల గుర్తును ఆమోదిస్తారు. ఈ విషయం ఓ 15- 30 రోజులపాటు చర్చలో ఉంటుంది, అంతే’ అని పవార్ అన్నారు. గతంలో కాంగ్రెస్ సైతం ‘జోడెద్దులు- కాడె’ నుంచి ‘హస్తం’ గుర్తుకు మార్చుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసిన శరద్‌ పవార్‌.. అదే విధంగా శివసేన(యూబీటీ) కొత్త గుర్తునూ ప్రజలు అంగీకరిస్తారని తెలిపారు. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్‌ వర్గానికి ‘కాగడా’ ఎన్నికల గుర్తుగా ఉంది. గత ఏడాది అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఈసీ దీనిని కేటాయించింది.

సుప్రీంకోర్టు కు ఉద్ధవ్

ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ శిందే వర్గానికి శివసేన పేరు, గుర్తును కేటాయించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతోపాటు భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకుగానూ ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఠాక్రే నివాసం 'మాతోశ్రీ'లో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడంతో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత భాజపా ఎమ్మెల్యేల మద్దతుతో శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం రెండు వర్గాలు పోటీపడ్డాయి.

నిజంనిప్పులాంటిది

Feb 18 2023, 19:57

సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. పరిశీలనలో ప్రయాణ మార్గాలు

రైలు ప్రయాణికులు ఎదురుచూస్తున్న సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దక్షిణ మధ్య రైల్వే త్వరలో పచ్చజెండా ఊపనుంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రైలు ప్రయాణ మార్గం, టికెట్‌ ధర, రైలు నంబర్లు వంటి వాటిపై కసరత్తు ప్రారంభించారు.

తిరుపతి(రైల్వే), న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలోనే పరుగులు పెట్టనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రైలు సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తుండగా.. రెండోది సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య పట్టాలెక్కనుంది.

అందుకు సంబంధించి ద.మ.రైల్వే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రైలు ప్రయాణ మార్గాలను అన్వేషిస్తున్నారు. మూడు మార్గాలు.. బీబీనగర్‌, నడికుడి, మిర్యాలగూడ మీదుగా, మరొకటి వరంగల్‌, ఖాజీపేట, కడప మీదుగా.. ఇంకొకటి బీబీనగర్‌ నుంచి గుంటూరు, నెల్లూరు, గూడూరు మీదుగా నడపాలని సర్వే చేపట్టారు. వీటితో పాటు పిడుగురాళ్ల జంక్షన్‌ నుంచి శావల్యపురం మీదుగా ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా సర్వే నిర్వహించారు. వీటిల్లో తక్కువ దూరం ఉన్న మార్గాన్ని పరిశీలించి, గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ట్రాక్‌ల పటిష్ఠత, వంతెన నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత మార్గాన్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. వందేభారత్‌ రైలు టికెట్‌ ధర జీఎస్‌టీ, తత్కాల్‌ సర్‌ఛార్జితో కలిపి రూ.1150 నుంచి ప్రారంభం కానుంది. టికెట్‌ ఛార్జి, రైలు నంబర్లు ఖరారు కాగానే ప్రయాణికుల అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందపరచనున్నారు. సాధారణంగా తిరుపతి- సికింద్రాబాద్‌ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ సమయం 12 గంటలు పడుతుండగా, వందేభారత్‌ రైలు ప్రయాణం ఆరేడు గంటలు పడుతుందని అధికారుల అంచనా. దీంతో తిరుమల, తిరుపతి పర్యాటకులు, భక్తులు వందేభారత్‌ రైలును ఆశ్రయించే అవకాశం ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరి నెలాఖరులోగా రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

నిజంనిప్పులాంటిది

Feb 18 2023, 19:55

ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2కు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు నిర్మించాలనుకుంటున్న ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2కు తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. భూసేకరణ పనులు ఎంత తొందరగా ప్రారంభిస్తే అంతే త్వరగా పనులు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

ఎంఎంటీఎస్‌ లైన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 విషయంలో ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్‌పురాలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరిన అఖండ జ్యోతియాత్రను కిషన్‌ రెడ్డి ప్రారంభించారు.

అఖండ జ్యోతి వెళ్లే మార్గంలో అన్ని వర్గాల ప్రజలు జ్యోతిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు. కొత్త దేవాలయాలను నిర్మించడం కన్నా ఉన్న ఆలయాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 156 దేవాలయాలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

నిజంనిప్పులాంటిది

Feb 18 2023, 19:53

రెండో రోజు ఆట పూర్తి.. ఆసీస్‌ 62 పరుగుల లీడ్‌

దిల్లీ: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 262 పరుగులకు ఆలౌట్‌ చేసిన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ ఖవాజా (6)ను జడేజా ఔట్‌ చేశాడు.

ప్రస్తుతం ట్రావిస్‌ హెడ్‌ (39), లబుషేన్‌ (16) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లోని సాధించిన ఒక పరుగు ఆధిక్యంతో కలుపుకొని ఆసీస్‌ 62 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.

నిజంనిప్పులాంటిది

Feb 18 2023, 19:51

తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

బెంగళూరు: గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna)కు బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

ఆయన ఆరోగ్యానికి సంబంధించి తాజాగా అప్‌డేట్‌ వచ్చింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

కాసేపట్లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు. గురువారం తారకరత్నకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ చేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి శనివారం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

నిజంనిప్పులాంటిది

Feb 18 2023, 19:49

జనసంద్రమైన శ్రీశైలం.. కనీస సదుపాయాలు కల్పించలేదని భక్తుల ఆగ్రహం

శ్రీశైలం ఆలయం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తెల్లవారుజామున 2గంటల నుంచే ఆలయంలో రద్దీ కొనసాగుతోంది.

ఉచిత దర్శనానికి 7గంటలు, శీఘ్ర దర్శనానికి 4గంటలకుపైగా సమయం పట్టింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండటం, కనీసం తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో దేవస్థానం అధికారుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరోవైపు సున్నిపెంట వద్ద శివ దీక్ష భక్తులు నిరసనకు దిగారు. హైదరాబాద్‌, తెలంగాణ ప్రాంతం నుంచి వాహనాల్లో ఉదయం శ్రీశైలం వస్తుండగా పోలీసులు సున్నిపెంట వద్ద అడ్డుకున్నారు. శ్రీశైలంలో పార్కింగ్‌ సదుపాయం లేదంటూ వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు భక్తులను శ్రీశైలంలోకి అనుమతించారు.